
[ecko_quote source="సామెతలు 18:21"]జీవ మరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు [/ecko_quote]
మనసు పరిశుద్ధ ఆత్మలో కలశం (మిళితము) అయినప్పుడు, అందులో ఉద్భవించే సద్భావనలు మనిషిని ఉత్తమ వ్యక్తిత్వంతో పరిమళము వెదజల్లేలా చేస్తాయి. మనలో అంతర్లీనంగా ఉండే మానవత్వ భావనలను వెలుపలకి తేవడానికి దేవుని సేవకులు, ప్రవక్తలు మరియు బైబిల్ గ్రంధ బోధకులు నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారు. సంభాషణలు జరిపారు, మార్గదర్శకాలు బోధించారు. మనిషి జీవితములో దేవుని యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఆధ్యాత్మిక రచనలు చేశారు. వాటిని మనం శ్రద్ధగా విని, దివి, ఆకళింపు చేసుకుంటే సుశీలత్వము, సద్భావనలు, మంచితనము తప్పక అంకురిస్తాయి.
మనిషి వ్యక్తిత్వానికి మంచి ప్రవర్తన మరియు సద్భావనే తావి, పరిమళము అద్దుతుంది. దానికి, మాటే మొదటి మెట్టు. మాటలతో ఎదుటివారి మనసును ఆకట్టుకోవచ్చు మరియు పోగొట్టుకొను వచ్చు. ప్రతి వ్యక్తీ మాట్లాడటంలో నాలుగు రకాల దుష్కర్మలు, చేయకూడనివి చేస్తుంటాడని బైబిల్ గ్రంధము తెలుపుతుంది. పౌరుష్యం- అంటే, కఠినంగా మాట్లాడటం. అనృతం అంటే, అబద్ధాలు చెప్పడం. చాడీలు చెప్పడాన్ని వైశూన్యం అంటారు. నాలుగోది అసంబద్ధ ప్రలాపం- అంటే, అనవసరంగా మాట్లాడటం. వీటికి చోటివ్వకుండా దేవుణ్ణి, ప్రేమించి, సత్యమును( అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును(యోహాను 8:32), యేసుక్రీస్తువుల వారే సత్యము) ఆశ్రయిస్తే, ప్రియంగా మాట్లాడగలిగితే ఎదుటివారి హృదయాలకు మరింత చేరువవుతామన్నది యథార్థం.
మనవా చరిత్రలో ఎందరో మహానుభావులు తాము పలికిన మాటల ద్వార మనుషుల హృదయాలను ప్రేరేపించి వారి మనసులను సంపాదించుకున్నారు. మరి కొందరు తాము పలికిన మాటల ద్వార మనుషుల హృదయాలను క్షోభ, వ్యాకులము మరియు బాధతో నింపి వారిని తమ నుంచి శాశ్వతముగా దూర పరచుకున్నారు. మరియు ఎన్నో దేవుని సంఘములు, విశ్వాసులు, దేవుని సేవకులము అను చెప్పుకోనుచున్న అనేకులు తాము పలికిన మాటల ద్వార ఒకరి ని ఒకరు సజీవముగా చంపుకొనుచున్నారు. ఇదీ ఎంతో విశాదకరము మరియు వినాశకరము. అందువలన క్రీస్తు సంఘములో ఏకత్వము లోపించి అది శక్తి లేనిది గా కనపడుచున్నది. క్రీస్తు సంఘములో ఏకత్వము మరుగుపడుటకు ప్రధాన కారణము పదవీ వ్యామోహం, కీర్తి, మరియు అహము.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్లో- నాలుగో స్థానంలో ఉండే మోహం అత్యంత ప్రమాదకరమైంది. మితిమీరిన మోహమే వ్యామోహం. దాన్ని త్యజించడం సద్భావనకు నాంది పలుకుతుంది. కీర్తి, కాంత, ధన, కనక, వస్తు, వాహనాలు వ్యామోహానికి కారకాలు. వీటి పట్ల మొదట్లో మోహం కలిగి, ఆ తరవాత వ్యామోహంగా మారుతుంది. అది చివరికి మనిషిని పూర్తిగా లోబరుచుకుంటుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వ్యామోహంలో ఉన్న వ్యక్తి దారీ తెన్నూ తెలియక అధర్మం, అసత్యం, అన్యాయం బాటపట్టి పతనావస్థకు చేరుకుంటాడు.
సత్ సాంగత్యం వల్ల నిస్సంగత్వం అలవడుతుంది. నిస్సంగత్వం వల్ల మోహం తొలగుతుంది. నిశ్చలతత్వం తెలుస్తుంది. దాని వల్ల రుణానుబంధ విముక్తి లభిస్తుంది. సత్ సాంగత్యం కేవలము పరిశుద్ధ ఆత్మతో సాంగత్యం మరియు తోటి విశ్వసులతో సత్ సాంగత్యం ద్వారానే సాద్యము. తద్వారా విశ్వాసి పదవీ వ్యామోహం, కీర్తి, మరియు అహము పై విజయం సాధించగలడు.
మనిషి అనవరతం సేవాభావన కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయడంలో, చక్కటి ఉపయోగకరమైన సలహాలు ఇవ్వడంలో ముందుండాలి. అతడు తన శారీరక బలాన్ని బలహీనుల కోసం ఉపయోగించడంలోనూ సేవాభావం వెల్లివిరుస్తుంది. ‘దానం చేయడం వ్యక్తిగత బాధ్యత’ అంటోంది పరిశుద్ద బైబిల్ గ్రంధము. ప్రతిఫలం ఆశించకుండా నిర్వర్తించే సేవాధర్మమే- దానం. దానికి నిత్య జీవన విధానంలో తగిన సమయం కేటాయించాలి. తల్లి, తండ్రి, గురువు, అతిథులు, మరియు దేవుని సేవకులు పట్ల ఆదరాభిమానాలు చూపుతూ మనిషి తన ఆధ్యాత్మిక సంపదను వృద్ధి చేసుకోవాలి. ముక్తి మార్గాన అంటే యేసు క్రీస్తు వైపు చూస్తూ అతడు పయనం సాగించాలని దేవుని వాక్యం హితవు చెబుతోంది.
చేసే కర్మలకు/పాపములకు ఫలితం ఉంటుందన్న ఎరుకను మనిషి కలిగి ఉండటమే నైతిక ప్రవర్తన. అదే శుభప్రదమైన, సంతోషకరమైన జీవితాన్నిస్తుందని దేవుని వాక్యము తెలియచెబుతోంది. మంచి ఆలోచనా సరళి, విలువలతో కూడిన జీవన శైలి, సరైన వ్యక్తిత్వం, శీల సంపద, నిరంతర సాధన, గుండె ధైర్యం ప్రసాదించే పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనము అను దినము కలిగి యుండవలేయును.
Image Source:
[http://brokengirl-guilty.tumblr.com/page/2]