Join us LIVE via Facebook or YouTube every Sunday at 5:30 PM (NZ) or 9:15 AM (India)
Daily Devotions and Meditation - Read and get encouraged
United Evangelical Church Logo

మనసున్న.. మనిషి…

Category:
Author: UEC Team
Date: October 9, 2016

దేవుని వాక్యం

[ecko_quote source="రోమీయులకు 12:1-2"]కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి[/ecko_quote]

వాక్యధ్యానం

దేవుని సృష్టిలో అత్యంత ప్రధానమైనది మానవుని సృష్టి. దేవుడు మానవుని మూడు విభాగముల (ఆత్మ, మనసు( ప్రాణము) మరియు శరీరము) సమన్వయంలో తన పోలికలో నిర్మించియున్నాడు. దేవుడు తన అపారమైన జ్ఞానం, తెలివి, బుద్ధి, మంచి ఆరోగ్యం మరియు సదా కాలము తనయందు జీవించులగున మానవుని నిర్మాణం జరిగిoచియున్నాడు. దేవుడు మానవుడియందు ప్రత్యేకముగా ఒక బాహు విశేష సుగుణము “తన సొంత చిత్తం” ను ప్రసాదించి, ఇక నరులారా బ్రతుకుడి అనీ సెలవిచ్చి యున్నాడు. కానీ నరులు దేవుడు అనుగ్రహించిన  సొంత చిత్తంను దుర్వినియోగం చేసుకోని నిరాశ మరియు శాంతి లేని జీవితం కొనసాగించుచున్నాడు. మానవుడు అన్ని విషయములో తన ప్రభావం మరియు విజయం చూపించుచున్నాడు కానీ తన మనసును మాత్రం తన ఆధీనములో ఉంచుకోవటానికి అవస్థలు పాడుచున్నాడు.

కొంతమంది జీవితానికి అర్థమే లేదనుకుంటారు, సమాజంలో ఇమడలేక అనవసరమైన భయాలు పెంచుకుంటారు, అన్నింటిమీదా ఆశ వదులుకుని చెప్పలేని విచారంతో మనసు డోలాయమానం అవుతుంటే ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనుకునేవారు- చాలామందే ఉంటారు. అటువంటివారికి మనసుపై స్వయంనియంత్రణ ఉండదు. అది గాడి తప్పి జీవన గమనంలో చేయవలసినదేమిటో తెలియని దిక్కుతోచని స్థితికి వారిని చేరుస్తుంది. అప్పుడు వారికి ఒక సమస్య నుంచి మరో సమస్య కొత్త పిలకలు వేస్తుంటుంది. మనసు మనిషిపై తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది. దాన్ని వదిలించుకోవటం అతడికి ఎప్పుడూ సమస్యే. అది నిలకడ లేనిది. ఎక్కడెక్కడికోపోయి తిరిగి వస్తూ ఉంటుంది. వాయువేగం కొలవడానికి మనిషి సాధనాలు కనిపెట్టగలిగినా, మనోవేగం తెలుసుకునే మార్గాలు కనిపించవు. మనిషి కోరికలు, అవి కలిగించే ప్రేరణలు- అతడి మనసును ఎప్పుడూ మూకుమ్మడిగా ముట్టడిస్తుంటాయి. అతడి వ్యాకులతలకు మూల కారణమయ్యే విషయాలు ఉంటాయి. వాటన్నింటికీ మనసును దూరంగా ఉంచవలసిన ఆవశ్యకతను బైబిల్ గ్రంధము సూటిగా అతడికి వివరించి చెబుతోంది. ఆధ్యాత్మిక సాధనలతో భౌతిక సంబంధాలను సరిచేసుకొనుమని అతనికి వాక్యం చెబుతోంది .

మనసు కల్లోలమైతే మానసిక నియంత్రణ సాధ్యం కాదు. అది మహాత్ములకే కష్టతరమవుతుంది. ఉన్నతమైన లక్ష్యాలకు చేరువలో ఉన్నా, మనసు కల్పించే భౌతిక ప్రలోభాల లోయల్లోకి దిగజారినవారి గాథలెన్నో మనకు బైబిల్ గ్రంధమునందు చూడగలుగుతాము. ఉదాహరణకు ,రాజైన దావీదు తన మనసు కల్పించిన అలజడి మరియు తాను మోహభావనలతో బతేషేబ పట్ల తీసుకున్న నిర్ణయం  ఆయన జీవితములో అది తీరని మచ్చగా మిగిలిపోయిన విషయం మనకు తెలియనిది కాదు (2 సమూయేలు 11:1-5)

దేహాన్ని బుద్ధితో, బుద్ధిని ఆత్మతో అనుసంధానించగల అభ్యాసాల సమాహారాన్ని రూపొందించుకోవాలన్న తపన మనిషికి ఎప్పుడూ ఉంది. దేహంతో చేసే అభ్యాసాలు శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచగలవని, మానసికాభ్యాసాలతో మనుషులు దేవునితో సన్నిహిత సంబంధం కలిగించ కలుగుతాయి. వాటితోపాటు బుద్ధికి క్రమశిక్షణ, నియంత్రణలను ఏకకాలంలో ఇవ్వగల దేవుని వాక్య ధ్యానము ద్వార మన మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందగలుగుతాము. శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు (రోమా 8)

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

మానసిక ఒత్తిళ్ల నుంచి మనసును తప్పించి దానికి ఒక సమతౌల్యం, ప్రశాంతతలను ప్రసాదించగల సామర్థ్యము కేవలం బైబిల్ గ్రంధ వాక్య ధ్యానమునకే సాధ్యం. పరిశుద్ధాత్మా సమర్పణలో, పర్యవేక్షణలో, శ్రద్ధతో చేసే వాక్య ధ్యానము మరియు ప్రార్థన, ఆధునిక జీవితం తెచ్చే మార్పులు, విసరుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవటమే కాకుండా, ఆత్మతత్వం తెలుసుకోగల సామర్థ్యం, అవకాశమూ మనిషికి దేవుని ద్వార సాధ్యం. మారుతున్న జీవనశైలిలో మనిషి ముఖ్యంగా సాధించవలసింది దేవుని వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మానడిపింపు. పరిపూర్ణమైన జీవితాన్ని, సహజమైన పద్ధతిలో గడపగల శక్తి కలిగేది మానసిక నియంత్రణతోనే. ఇహ పర సాధనలకై ఎక్కవలసిన తొలి మెట్టు అదే!

 

Image Source: 

[http://7-themes.com/data_images/out/51/6945861-red-love-heart.jpg]

Copyright © 1991-2023 United Evangelical Church Global
Made with love for Jesus Christ of Nazareth
crossmenu