
[ecko_quote source="హెబ్రీయులకు 12:1"]మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. [/ecko_quote]
బైబిల్ గ్రంధం మానవుని జీవితం ఈ ప్రపంచమునందు, ఒక బాటసారి జీవితముగా వర్ణించారు. ఎందరో మేధావులు జీవితాన్ని నిరంతర ప్రయాణంగా అభివర్ణించారు. ఒక ధ్యేయంగాని, లక్ష్యంగాని కనపడనప్పుడు- ‘ఈ ప్రయాణానికి అర్థం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం?’ అనిపిస్తుంది. గమ్య స్థానం అన్నది కనిపించనప్పుడు, జీవితం అసలు ప్రయాణం ఎలా అవుతుంది? ఏ ప్రయాణానికైనా గమ్యం అనేది ఉండాలి. పరిణామ క్రమం, కొనసాగింపు లేకుండా జీవితం వృత్తాకారంలో సాగితే- ఆ ప్రయాణం అర్థరహితం. దీర్ఘంగా కొనసాగితే, ఎప్పటికో ఒకప్పటికి యానం చివరి దశకు చేరుకుంటుంది. అది నిరంతర ప్రయాణం అయినప్పుడు, ఆలోచనకు మరియు తర్కానికి అందకుండా పోతుంది. అందుకే మనిషి సత్యాన్ని అన్వేషించాలి. జీవ గ్రంధంనందు అపొస్తలుడైన పౌలుగారు క్రైస్తవ ప్రయాణం వృత్తాకారంలో జరుగే ప్రయాణం కాకుండా యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ జరిగించు గొప్ప ప్రయాణంగా వర్ణించారు. యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ జరిగించని ప్రయాణం అర్థరహితం మరియు శూన్యం.
ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చామన్న ప్రశ్న కీలకం. నేర్చుకోవడానికి, జ్ఞానం సంపాదించుకుని ఆ దేవుని సేవలో తరించడానికి వీలు, అవకాశం దొరికాయని కొందరు గుర్తిస్తారు. మరెందరో ఈ యథార్థాన్ని గ్రహించేసరికి, వారి ప్రయాణం పరిసమాప్తం అవుతుంది .ప్రతి ఒక్కరికీ ‘ఇక్కడికి ఎందుకొచ్చాం, ఈ జీవితం ఏమిటి, ఎందుకు...’ లాంటి విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం మరియు జిజ్ఞాస ఉంటుంది. ధ్యానంతో జీవితం మీద దృష్టి సారించి, ప్రయాణంలో ఆనందాన్ని పొందాలి. వర్తమానంలో జీవిస్తూ, పరిశుద్ద ఆత్మ నడిపిoపులో, ఆత్మశోధనతో జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోన బద్దులమైయున్నాము (II కోరి 5:7) నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు” (గలతీయులకు 5:16).ఇవి భక్తుడైన పౌలుగారు క్రీస్తు వైపు ప్రయాణించువారికి సెలవిచ్చు జీవపు మాటలు.
క్రీస్తు వారి వైపు చూస్తూ ప్రయాణంలో వేసే ప్రతి అడుగూ ఆనందంతో కూడినదే. మనకు జరగనున్నది తెలియదు. జరిగిపోయినదాని గురించి చింతించీ ప్రయోజనం లేదు. గతం ఒక అనుభవం. భవిష్యత్తుకు అదొక పాఠం. యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త అధ్యాయం 6 -26 లో ఈ విధముగా చేప్పియున్నాడు “ అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
మన గమ్యం క్రీస్తు వారి వైపు. జీవితంలో కలలు, లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. గమ్యం లేదని భావిస్తే, ప్రయాణం వృథా అవుతుంది. ఎటువంటి విలువా ఉండదు. అది జీవితంలో ప్రతి అంశంపైనా ప్రభావం చూపుతుంది. జీవన యానం అంటే- వూహ, యథార్థాలు కలిసే సున్నితమైన సమస్థితిని కనుక్కోవడం! మనిషి తన అసంపూర్ణ జ్ఞానం నుంచి, అనిశ్చితమైన పరిస్థితుల నుంచి క్రీస్తు గురించి అనంతమైన పాఠాలు నేర్చుకుంటూ సాగిపోవడమే జీవితం.
ఒక రైల్లోనో, ఓడలోనో చేసే ప్రయాణం లాంటిదే జీవన యాత్ర! మధ్యమధ్య మజిలీలు, మార్గాలు, మలుపులు, ప్రమాదాలు... అనేకం. జన్మించడంతోనే మనిషి ప్రయాణం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులూ మనతోపాటు గమ్యం చేరుకునేదాకా తోడుగా ప్రయాణిస్తారని భావిస్తాం. మధ్యలో ఎక్కడో ఒకచోట వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు- తమ జ్ఞాపకాలను మిగిల్చి! కదిలే కాలం మరెందరో ప్రయాణికుల్ని కలుపుతుంది. తోటి ప్రయాణికులంతా జీవితంలో ముఖ్యమైనవారే. తోబుట్టువులు, స్నేహితులు, పిల్లలు... అందరూ. జ్ఞాపకాలను వదిలిపెట్టి, శాశ్వతమైన శూన్యాన్ని నింపి, వెళ్లిపోతారు. ఎవరు ఎప్పుడు ప్రయాణం ముగించి వారి స్థానాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో కూడా గుర్తుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలో సుఖదుఃఖాలు, సంభ్రమాశ్చర్యాలు... ఎన్నో ఉంటాయి. బాధ్యతగా మసలుకోవాల్సిన అవసరం, స్వాగతం పలకడం... వీడ్కోలు చెప్పడం... ఎన్నెన్నో.
ప్రయాణం సుఖప్రదం కావాలంటే, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. అందుకే ప్రేమలు, సత్సంబంధాలు అవసరమవుతాయి. అందుకే భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథము అధ్యాయం 133 లో ఈ విధముగా సహోదరులు ఐక్యతను వర్ణించినాడు “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు".
ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకోక తప్పదని తెలుసు. చిత్రమేమిటంటే- తమ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. తెలియనితనంతోనే వారు ప్రయాణిస్తారు. ఈ యానంలో ఎవరూ విస్మరించరాని అంశం ఒకటి ఉంది. ప్రయాణం ముగించి తమ స్థానం విడిచి వెళ్ళేలోపు, తోటి ప్రయాణికుల కోసం/ సహోదరుల కొరకు మధురమైన జ్ఞాపకాలను కొన్నయినా పదిలపరచాలి. ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలనతో ముందుకు సాగితేనే, ఈ గమనం సుగమం కావడంతో పాటు సుఖవంతంగా మారుతుంది!
Image Source:
[https://pbs.twimg.com/profile_images/467774309503467520/HMy_9pqg.jpeg]