[ecko_quote source="1 యోహాను 4:7-8"]ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. [/ecko_quote]
అద్భుతమైన మహిమ కలిగిన రెండు బీజాక్షరాల పవిత్ర శబ్దం ‘ప్రేమ’. సకల జీవకోటి మనుగడకూ ఇదే మూలాధారం. ప్రకృతితో మానవుడి సంబంధం ప్రేమతోనే ముడివడి ఉంది. మానవతా వృక్షానికి వేరు వంటిది ప్రేమ. మహోత్తమ మానవ జీవన యాగానికి అది పూర్ణాహుతి వంటిది. బతుకు బడిలో ప్రతి విద్యార్థీ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ప్రేమభావనే. అది మనిషికి బతుకునిస్తుంది, మెతుకునిస్తుంది, సద్గతికి చేరుస్తుంది, జీవితాన్ని సార్థకం చేస్తుంది. అందుకే దాన్ని ‘ప్రేమసుధ’ అంటారు విజ్ఞులు.
మనిషి సంఘజీవి. సమాజంలో ఉన్నంతవరకు తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని, సాటివారిని, అలాగే భగవంతుణ్నీ ప్రేమించాల్సిందే. దానివల్లనే సుఖం, శాంతి, స్థిరత్వం లభ్యమవుతాయి. (లూకా 10:27) ప్రేమ వల్ల హింస దూరమవుతుంది. ద్వేషం, ప్రతీకార వాంఛ వంటి మనోవికారాలకు మనసులో తావు ఉండదు. అప్పుడు ప్రేమ ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో, దేవుని చింతనలో లగ్నమవుతుంది(1కోరిం 13:4-7).
వ్యక్తిని దేవుని సన్నిధికి చేర్చే ప్రధాన ద్వారం ప్రేమ ఒక్కటే. అది కుటుంబానికే పరిమితమైతే స్వార్థపూరితం అనిపించుకుంటుంది. మనుషుల్ని ప్రేమించి, వస్తువుల్ని వాడుకోవాలన్నాడు మన ప్రభువు. వస్తువుల్ని ప్రేమించి, మనుషుల్ని వాడుకుంటున్నారు అనేకులు! పువ్వు మనుషుల్ని చూసి సుగంధమివ్వదు. దానికి అందరూ సమానమే. ఆ సుగంధాన్ని అంతా ఆస్వాదిస్తారు. అలాగే, మనిషి ప్రేమ లోక కల్యాణం కోసం వ్యక్తం కావాలి ప్రేమ. అహింసకు పునాది నాది అనేది పోగొట్టగలిగేదే అసలైన ప్రేమ.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును……నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. (1కోరిం 13:4-11).
‘ప్రేమ అనే రెండక్షరాల మహిమను తెలుసుకోకుంటే, ఎంతటి పాండిత్యమైనా వ్యర్థమే’ అంటాడు కబీర్‌దాసు. ప్రేమ అనేది ఇచ్చేదే కానీ, తీసుకోవాలని కోరుకునేది కాదు. లాభనష్టాల బేరీజును తిరస్కరించే ప్రేమ- మనసును పవిత్రం చేయగలుగుతుంది. ఎదుటివారి మనసుల్నీ నిర్మలం చేసి ఆకట్టుకుంటుంది.
మనుషులపైనే కాదు- విద్యార్జన, జ్ఞానార్జన పైనా; సంస్కృతి సంస్కారాలపైనా ప్రేమ పెంచుకుంటేనే, దానికి పరిపూర్ణత సిద్ధించినట్లవుతుంది. మనిషి ముందు తనను తాను ప్రేమించుకోవాలి. తన శ్రమను, వృత్తిని, తన ప్రవృత్తిలోని చిత్తశుద్ధినీ ప్రేమించగలగాలి. అప్పుడే ప్రేమ ఆత్మవిశ్వాసాన్ని, విశాల దృక్పథాన్ని, దేవుని కుటుంబ భావనను ఆహ్వానించగలుగుతుంది. ఆధ్యాత్మిక కోణంలో ‘ప్రేమే దైవం’ అనే అక్షరసత్యమూ అవగతమవుతుంది. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. 1 యోహాను అధ్యాయం 4-7-12; దేవుడు మిమ్మలిని ఆశీర్వదించును గాక
పాస్టర్ జోనా రవీందర్
మూలం: చిమ్మపూడి రామూర్తి గారికి నా కృతజ్ఞతలు
Image Source:
[http://agapea2.com/wp-content/uploads/2012/09/heart-on-door.jpeg]